చిట్వేలు, తిరుపతి జిల్లా:
పీఎం శ్రీ జడ్‌పీ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూప్, చిట్వేలులో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సీసీ ప్రవేశ నమోదు కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి ఏవో లెఫ్టినెంట్ కల్నల్ లలిత్ బాబు ఆధ్వర్యంలో 32 మంది జూనియర్ డివిజన్ 18 మంది జూనియర్ వింగ్ క్యాడెట్లను ఎంపిక చేయగా, అదనంగా 8 మంది రిజర్వ్ క్యాడెట్లను ఎంపిక చేశారు.
లెఫ్టినెంట్ కల్నల్ లలిత్ బాబు మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అత్యుత్తమ యువజన సంస్థ అని పేర్కొన్నారు. ఎన్‌సీసీ ద్వారా విద్యార్థులకు సైనిక శిక్షణతో పాటు జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత, విపత్తుల సమయంలో సేవా దృక్పథం అలవడుతుందని వివరించారు. భవిష్యత్తులో రక్షణ దళాలు, పోలీసు శాఖ మరియు ఇతర పోటీ పరీక్షల్లో ఎన్‌సీసీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ విద్యార్థులను అభినందిస్తూ, పాఠశాల ఎన్‌సీసీ ట్రూప్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుబేదార్ దిలీప్ పాల్, బీహెచ్‌ఎం బాలకృష్ణ, హవిల్దార్ వరహాలు, స్వాతి, కిరణ్ కుమార్, చలమారెడ్డి, భాష, నాయక్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.