హర్యానాలోని గురుగ్రామ్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మృతిచెందారు. స్థానికంగా ఓ వ్యాపారి ఇంటి వద్ద గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు దిగడంతో పోలీసులు ప్రతీకాల్పులు జరపగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఎస్‌యూవీలో సాయుధ వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపారి ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్లు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
ఈ ఘటనలో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మృతిచెందగా, మరో నిందితుడు గాయపడ్డాడు. ముగ్గురు పోలీసు సిబ్బందికి కూడా తూటా గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా సంబంధిత వ్యాపారికి విదేశీ గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయని, నిందితుల వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మృతులు, గాయపడిన నిందితుల పూర్తి వివరాలు, వారి నేర చరిత్రను త్వరలో వెల్లడిస్తామని పోలీసు శాఖ పేర్కొంది.