జడ శ్రవణ్ రూ.25 కోట్ల వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్.. మత ఘర్షణల కుట్ర వెనుక ఉన్న వారిపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. సనాతన ధర్మం, హిందుత్వంపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏలూరులో జరిగిన సభలో జడ శ్రవణ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని ఆయన అన్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, నటుడు ప్రకాశ్ రాజ్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. వీరంతా "పెయిడ్ ఆర్టిస్టులు" అంటూ విమర్శించారు.

రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీలో అన్ని మతాలు, అన్ని కులాలకు ప్రభుత్వం సమాన గౌరవం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.