పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో అత్తాపూర్‌లో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ బృందం, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

ఈ దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పోలీసులను తప్పించుకుని పరారయ్యారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

పట్టుబడిన నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్, నిషేధిత ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, ఒక కత్తి, ఐదు మొబైల్ ఫోన్లు, అలాగే రూ.16,930 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై మరింత కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.